Friday, 10 November 2017

కార్తిక పురాణం - 30 (KarteekaPuranam-30)

30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 29 (KarteekaPuranam-29)

కార్తీక పురాణం - 29

29వ అధ్యాయము
అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 28 (KarteekaPuranam-28)

కార్తీక పురాణం - 28

28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 27 (KarteekaPuranam-27)

కార్తీక పురాణం - 27

27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"
ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 26 (KarteekaPuranam-26)

కార్తీక పురాణం - 26

26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గి౦చుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వి౦శోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 25(KarteekaPuranam-25)

కార్తీక పురాణం - 25

25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట

"
అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.


కార్తిక పురాణం - 24(KarteekaPuranam-24)

కార్తీక పురాణం - 24

24వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము

అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.

"
గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసిన౦దువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల క౦గీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యెంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

"
ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభ౦గమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి "మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహే౦ద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్త కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వి౦శోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.